విజయానికి నిర్వచనమేంటి? బాగా డబ్బు సంపాదించడమా? పేద్ద ఉద్యోగం చేయడమా? లేక మనం కోరుకున్నది పొందటమా?
ఎవరు గొప్ప మనసున్న వారు? తాను ఓడిపోయినప్పుడు తనలో స్పూర్తి నింపినవారా? లేక తన మీద ఓ నింద పడి, అస్తిత్వం ప్రశ్నైనప్పుడు ఆ నింద తనపై వేసుకుని తన భవిష్యత్తునే ఫనాంగా పెట్టి తన నేస్తాన్ని కాపాడినవారా? లేక ఆ విషయం తెలిసాక మిత్రుడి కోసం తన పదవినీ,అధికారాన్ని తృణప్రాయంగా వదిలినవారా?
మహర్షి లో ప్రతి పాత్ర ఉదాత్తంగా అనిపిస్తుంది. కృషి, పట్టుదల, సంకల్పం, వివేకం, సామాజిక బాధ్యత లాంటి విషయాల్లో మనలో స్పూర్తిని నింపుతుంది.
ఆ మధ్య హిందీలో వచ్చిన ఆమీర్‌ఖాన్ "3ఇడియట్స్", షారుఖ్ "స్వదేశ్ " ఛాయలున్నా సమకాలీన సమస్యల్ని చర్చిస్తూ వాటికి తనకు తోచిన పరిష్కారం ఇవ్వడం బాగుంది.
ఎక్సెలెంసి (శ్రేష్ఠత) మీద దృష్టి పెడితే విజయం దానంతట అదే వస్తుండంటాడు రాంఛో (3ఇడియట్స్)
ఓడిపోతామనే భయంతో, ఓడిపోకూడదనే సంకల్పం తో పని మొదలెట్టమంటాడు ఋషి (మహర్షి).
తనను పెంచిన ఆయమ్మ ను అమెరికా తీసుకెళ్లటానికి ఇండియాకి వస్తాడు మోహన్ (స్వదేశ్). తనకోసం తన భవిష్యత్తునే ఫనంగా పెట్టిన మిత్రుడిని అమెరికా తీసుకెళ్లటానికి ఇండియాకి వస్తాడు ఋషి (మహర్షి).
ఉదాత్తమైన పాత్రలు, వాటి ఆదర్శాలు, సమకాలీన సమస్యలు వాటికి పరిష్కారం ఇవన్నీ మహర్షి సినిమాని ఓ మంచి సినిమాగా నిలబెడతాయి.