హీరోను ఇనుప గొలుసులతో కట్టేసి ఉంచుతారు . అతడిని విలన్ రెచ్చగొడతాడు. అంతే.. హీరోకు ఆవేశం వస్తుంది. అతను విసిరిన విసురుకి గొలుసులు కట్టేసి ఉన్న ఇనుప స్తంభాలు భూమి లోతుల్లోంచి బయటికి వచ్చేస్తాయి. ఇలాంటి మాస్ సీన్స్ తెలుగు సినిమాల్లో ఎన్ని చూడలేదు? అక్కడితో ఆగిపోతే బోయపాటి ప్రత్యేకత ఏముంది? వెంటనే హీరో చేతికి ఒక కత్తి దొరుకుతుంది. అతడి మీదికి ఇద్దరు రౌడీలు దూసుకొస్తారు. ఆ ఇద్దరి తలల్ని ఒకేసారి నరికితే.. అవి గాల్లోకి ఎగిరి వందల కిలోమీటర్ల స్పీడుతో దూసుకెళ్తుంటాయి. అంతలో రెండు గద్దలొచ్చి ఒక్కో తలను ఎగరేసుకుపోతాయి. విలన్ రోకో రోకో అని అరుస్తూ మెషీన్ గన్ తీసుకుని గద్దల్ని కాలుస్తాడు. ‘వినయ విధేయ రామ’ గురించి మాట్లాడుతూ.. మధ్యలో ఏమిటీ పిచ్చి ఫాంటసీలన్నీ అనిపిస్తోందా? ఇది నిజ్జంగా ఈ సినిమాలోని సీనే. దీన్ని బట్టి ఈ సినిమా ఎలా ఉండొచ్చని ఒక అంచనాకు వచ్చేయండి.